Guru Purnima: హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకూ ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. కానీ ‘గురు పౌర్ణమి’ మాత్రం ఇందుకు భిన్నమైనది. గురు సమానులైన వారికి కృతజ్ఞతలు తెలుపుకునే ఈ పర్వదినం అత్యంత విశిష్టమైనది. ఈ నేపథ్యంలో గురు పౌర్ణమి ప్రత్యేకత, ఆ రోజు చేయాల్సిన పూజా విధానం గురించి తెలుసుకుందాం!
గురు పౌర్ణమి ప్రత్యేకత: ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పూర్ణిమ’ అంటారు. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం.. ఇది వేద వ్యాస భగవానుడి జన్మదినం. ఈ పవిత్ర రోజున వ్యాసుడిని పూజించడం తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయం. అయితే ఒక్కరి ఇళ్లలో వ్యాస భగవానుడి చిత్రపటాలు ఉండకపోవచ్చు. అలాంటి వారు ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత “వ్యాం, వేద వ్యాసాయ నమః” అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే వ్యాసుడిని పూజించిన ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా ఈ రోజు మనకు విద్యాబుద్ధులతో పాటు సమాజం పట్ల అవగాహన కల్పించిన గురువులను సైతం పూజించాలి. ఎందుకంటే ఈ రోజు గురువును పూజిస్తే వ్యాస భగవానుడిని ప్రార్థించినట్లే. “గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే నన్ను పూజించినట్టే” అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారని నానుడి. అంతేకాకుండా ఈ రోజు గురు స్వరూపులైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిర్డీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామిని సైతం పూజించడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read-Meditation: సర్వోన్నతం.. ధ్యానాత్మక జీవితం
గురు స్వరూపులను పూజించే విధానం: ఈ రోజున ఆషాఢ పౌర్ణమి రోజు గురు స్వరూపుడైన దత్తాత్రేయునికి శనగలను దారంతో కట్టి దండలాగా అలంకరించాలి. మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఆ చెట్టు వద్ద దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయడం మంచిది. అంతకాకుండా ఈ రోజు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం లేదా అభిషేకం చేయించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. పూర్తి స్తోత్రం చదవడం వీలుకాని వారు “శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః” అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించాలి. గురు పౌర్ణమి రోజు షిర్డీ సాయిబాబా ఆలయంలో హారతిని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుంది. సాయి ధునిలో ఎండిన కొబ్బరికాయను వేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో ఆముదపు నూనెతో దీపాలు వెలిగించి, భక్తులకు తాలింపు పెట్టిన శనగలను ప్రసాదంగా పంచాలి. వ్యాస పూర్ణిమ రోజు రాఘవేంద్ర మఠాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి మంత్రాక్షతలు తెచ్చుకుని, ఏదైనా పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు వాటిని ధరిస్తే శుభఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గురుపౌర్ణమి రోజున దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్రుడు, షిర్డీ సాయి బాబాలలో ఎవరిని పూజించినా సాక్షాత్ వ్యాస మహర్షిని ఆరాధించినట్లేనని హిందూ సంప్రదాయంలో నానుడి.

