సిద్దిపేట (తెలుగుప్రభ): రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు, ఎన్నికల హామీల అమలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, సిద్దిపేటలో జరిగిన సీపీఎస్ ఉద్యోగుల నిరసన సభ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం రాత్రి సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన ‘జనచైతన్య యాత్ర’ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం ప్రకటించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
‘మీ పోరాటానికి మద్దతుగా నేనే వచ్చాను’ : సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు దేవరాజు వినతిపత్రం ఇచ్చేందుకు తన క్యాంపు కార్యాలయానికి వస్తామని చెప్పగా, “మీరు ఎందుకు రావాలి.. మీ న్యాయమైన పోరాటానికి మద్దతుగా నేనే వస్తాను” అని చెప్పినట్లుగానే ఇక్కడికి వచ్చానని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, జిల్లా అధ్యక్షుడు దేవరాజు, ప్రధాన కార్యదర్శులు శశికుమార్, రఘురామ, ఉదయశ్రీతో పాటు భారీ వర్షంలోనూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యోగులను ఆయన అభినందించారు.
ఓపీఎస్ హామీ ఇచ్చింది కాంగ్రెస్ కాదా..? : సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగులు అడుగుతున్నది ఎలాంటి అన్యాయమైన కోరిక కాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఉద్యోగుల వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే ఓపీఎస్ అమలు చేస్తామని చేతులు జోడించి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు పూర్తయినా ఉద్యోగులు ఓపికగా ఎదురుచూశారని, అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతోనే ఇప్పుడు ఉద్యమబాట పట్టారని అన్నారు.
మేనిఫెస్టోను సమాధి చేశారా..? : ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, మెరుగైన ఈహెచ్ఎస్, ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. “మీరు ఇచ్చిన గ్యారెంటీలను సమాధి చేశారా..? కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పుడు చిత్తుకాగితంగా మారిపోయిందా..? ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా..?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలవవు, : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న హరీశ్‌రావు, అలాంటి ఉద్యోగులతో విభేదించిన ప్రభుత్వాలు చరిత్రలో నిలవలేదన్నారు. సరైన సమయంలో ఉద్యోగులే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాటం : రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓపీఎస్, పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ వంటి ఉద్యోగుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా ఉద్యోగుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు.
ఏసీబీ, సీఐడీతో భయపెడుతున్నారు : ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యోగులపై విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ విచారణల పేరుతో అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. అలాంటి చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ ఉద్యోగుల వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నిధులను కూడా ఎనిమిది నెలల పాటు ప్రభుత్వం జమ చేయలేదని, బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రశ్నించిన తర్వాతే చెల్లింపులు ప్రారంభించిందని విమర్శించారు.
‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతూ తెలంగాణకు గుర్తింపు తీసుకొస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించడం అత్యంత బాధాకరమన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం విద్యార్థులనే కాదు, వారికి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను కూడా అవమానించినట్లేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖలో వైఫల్యాలపై విమర్శలు : విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని హరీశ్‌రావు ఆరోపించారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా పాఠశాలలకు గ్రాంట్లు విడుదల కాలేదని, చాక్‌పీసులు కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేవని అన్నారు. స్కావెంజర్లకు ఏడు నెలలుగా జీతాలు అందడం లేదని, విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ కాలేదని, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం నిలిచిపోయిందని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్ల ధరలు పెరిగినా తగిన నిధులు ఇవ్వలేదని, ఎంఈఓ, డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు కాలేదని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని, మెగా డీఎస్సీ కూడా అమలు చేయలేదని పేర్కొంటూ, ఇన్ని వైఫల్యాలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగేందుకు రేవంత్‌రెడ్డికి నైతిక హక్కు లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ఉద్యమానికి పూర్తి మద్దతు : “పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప మరేమీ కాదు” అంటూ ఉద్యోగులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, ఆరు పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ అండదండలు అందిస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. ఈ నిరసనలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

