_ రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్
_ ప్రజల పక్షాన నిలదీస్తున్నందుకే అవినీతి ఆరోపణలు
_ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
గజ్వేల్, (తెలుగుప్రభ) : గజ్వేల్ కు పూర్వవైభవం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ లోని దొంతుల ప్రసాద్ గార్డెన్స్ లో ఆదివారం తురక కాశిలకు స్టోన్ క్రషింగ్ పనిముట్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో అట్టడుగున నిలిచిన తురక కాశిలకు అండగా నిలుస్తామని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టగానే వారి అభ్యున్నతికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, కన్నేపల్లి వద్ద స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఎండుతున్న పొలాలకు సాగునీరు అందించవచ్చని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పంటలు ఎండుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అరకొర విద్యుత్ సరఫరాతో అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, అవినీతి ఆరోపణలు చేస్తు ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న గజ్వేల్ ను మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా వెనుకబడి పోయిందని, చిన్న చిన్న సమస్యలను సైతం ప్రభుత్వం పరిష్కరించలేని దుస్థితి ఉండడం హేయమన్నారు.
గతంలో మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా నిలిచి ఆందోళన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అబద్దాల మాటలతో ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన తీరు మారుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఇప్పటికైనా ప్రజా సమస్యలు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ చైర్మన్ రాజమౌళి గుప్త, మాజీ వైస్ చైర్మన్ జాకీయొద్దిన్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జుబేర్ పాషా, పట్టణ పార్టీ అధ్యక్షుడు నవాజ్ మీరా, సీనియర్ నాయకులు దేవి రవీందర్, ఆకుల దేవేందర్, చంద్రమోహన్ రెడ్డి, మెట్టయ్య గుప్త, ప్రశాంత్, దుర్గయ్య, నూనె కుమార్ యాదవ్, సంతోష్ గుప్త, బొగ్గుల సురేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

