Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు రావాలనే దురుద్దేశంతో హరీశ్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారంటూ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీతో పాటు హరీశ్ రావు ఖండించారు. అంతేకాకుండా తనపై నిరాధార ఆరోపణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.
బహిరంగంగా క్షమాపణకు డిమాండ్: ప్రత్యర్థులపై రాజకీయ లబ్ధి కోసం పూర్తిగా అసత్యాలు, కల్పితాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. తక్షణమే తమ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాలు మరియు ఇతర వేదికల్లో అప్పట్నుంచి ఉన్న సంబంధిత వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో పరువు నష్టం దావాలతో పాటు తీవ్రమైన క్రిమినల్ చర్యలకు సంబంధించిన న్యాయ పోరాటం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. కాంగ్రెస్ నేతలు ఈ లీగల్ నోటీసులపై ఏవిధంగా స్పందిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Also Read-శిక్ష అవసరమే.. నివారణే కీలకం.. పేపర్ లీకేజీలకు పుల్‌స్టాప్ పడేనా?

