Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ మోటార్లు నడపకుండా పంటలను ఎండబెట్టడం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌ల క్రిమినల్ నెగ్లిజెన్స్ అని ధ్వజమెత్తారు. ఇందుకోసం వారిద్దరినీ ఉరి తీసినా తప్పులేదని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ నీళ్లు!: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. “నిన్న రేవంత్ రెడ్డి కడుపులో కుళ్లు పెట్టుకుని.. నోట్లోంచి సొల్లు వాగారు. మళ్లీ అన్నీ అబద్ధాలే చెప్పారు. అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు. నిన్న రేవంత్ చెప్పిన ప్రతి అబద్ధానికి, ప్రతి అక్షరానికి నేను సమాధానం చెబుతా” అని హెచ్చరించారు. కేసీఆర్ అన్నీ కట్టిపెట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా సిద్ధం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. దేవాదుల దగ్గర మోటర్లను ఎందుకు ఆన్ చేయడం లేదని రేవంత్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ ఇచ్చుకోవడానికే తెలంగాణ వాడుకోవాల్సిన నీళ్లను రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు వదిలేస్తున్నారని ఆరోపించారు.
దమ్ముంటే ఆ డాక్యుమెంట్ బయటపెట్టు.. రాజీనామా చేస్తా!: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు బహిరంగ సవాల్ విసిరారు. “తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు ఏదైనా అధికారిక డాక్యుమెంట్ ఉంటే రేవంత్ రెడ్డి బయట పెట్టాలి. అలా నిరూపిస్తే నేను నా పదవికి తక్షణమే రాజీనామా చేస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి తప్పయిందని తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. వర్షాలు లేవు, ఎల్‌నీనో వల్ల నదుల్లో నీళ్లు లేవు, మోటార్లు ఎక్కడ ఆన్ చేయాలంటూ సీఎం రేవంత్ చెబుతున్న సమాధానాలపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్షణానికి కూడా మెడిగడ్డ బ్యారేజ్ వద్ద 89,230 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని గణాంకాలతో సహా నిరూపించారు. “వాన పడినా పడకున్నా మెడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి. అందుకే కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు కట్టారు. తెలంగాణ కోసం ఆ నీళ్లను ఒడిసి పట్టకుండా.. చంద్రబాబు కోసం ఆంధ్రాకు విడిచిపెడుతున్నారు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయని రుజువైంది.. మరి ఇప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్?” అని నిలదీశారు.
Also read-YS Jagan: “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా”
బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై కౌంటర్: సీఎం రేవంత్ రెడ్డి తన శరీరాకృతిపై చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. “పొట్టిగా ఉన్నోడికి.. పొడుగోన్ని చూస్తే జెలసీ ఉంటుంది. రేవంత్‌కు అస్సలు మెదడు లేదు. తను తాటి చెట్టులాగా పెరిగానని రేవంత్ అంటున్నాడు. దానికి నేనేం చేయాలి? దేవుడు నిన్ను ఇప్ప చెట్టులాగా పొట్టిగా పుట్టించాడు” అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే హరీశ్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

