HomeTop StoriesHeat Waves: భగ్గుమంటున్న భానుడు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

Heat Waves: భగ్గుమంటున్న భానుడు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు తోడవ్వడంతో.. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం వేళల్లో భూమి నుంచి వచ్చే వేడితో ఉక్కపోత తీవ్రంగా ఉంటోంది.

- Advertisement -

తెలంగాణలో నలుగురు మృతి: మంగళవారం అత్యధికంగా నల్గొండలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సైతం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వడదెబ్బ కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు: ఏపీలో సైతం భానుడు భగభగమంటున్నాడు. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఏపీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఏపీలోని మొత్తం 262 మండలాల్లో 40°Cకి పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాయలసీమ ప్రాంతం సైతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

ఆరోగ్య నిపుణుల సూచనలు:

  • అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దు.
  • వీలైనంత వరకు ప్రయాణాలను ఉదయం లేదా సాయంత్రం చల్లని వేళల్లోనే పెట్టుకోండి.
  • హైడ్రేషన్ ముఖ్యం: శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఇంట్లోనే తయారు చేసిన నిమ్మరసం, మజ్జిగ, బెల్లం పానకం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.
  • ఎండలో ప్రయాణం చేసి వచ్చిన వెంటనే అతి చల్లని నీటిని తాగవద్దు. వేడిగా ఉన్న శరీరంపై ఒక్కసారిగా చల్లదనం పడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
  • బయట నుంచి వచ్చిన వారు కాసేపు చల్లని ప్రదేశంలో సేద తీరిన తర్వాతే.. కాళ్లు చేతులు కడుక్కుని ఆహారం తీసుకోవాలి.
  • వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించడం ఉత్తమం. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా రుమాలు ధరించండి.
  • అధిక జ్వరం, స్పృహ తప్పడం, వాంతులు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News