HomeTop StoriesTelangana: నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Telangana: నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Rain alert: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

- Advertisement -

18 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు: భారీ వర్షాల ముప్పు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.

ఏన్కూరులో 7.9 సెం.మీ వర్షం: గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరులో 7.9 సెం.మీ, తల్లాడలో 6.0 సెం.మీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో 4.0 సెం.మీ, దమ్మపేటలో 3.0 సెం.మీ వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రేపటికల్లా కేరళను తాకనున్న రుతుపవనాలు: మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు గడువు సమీపించింది. రేపు కేరళ, తమిళనాడు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాస్త ఆలస్యం కావడంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

Also Read-Ponnam prabhakar: తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే

ఒకవైపు వానలు.. మరోవైపు ఎండలు: రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరో 27 జిల్లాల్లో సైతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ 40.2 డిగ్రీల నుండి 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News