Kaleshwaram project: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించాల్సి ఉంది. కానీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈ తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నప్పటికీ న్యాయస్థానం తన నిర్ణయాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేపథ్యం: 2024 మార్చి 14న కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 6 ద్వారా ఈ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ నియామకంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె.జోషిలు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. తగిన ఆధారాలు లేకుండా.. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే అభియోగాలు మోపుతున్నారనిపేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల పేరుతో ఇతరుల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా విచారణ సాగుతోందని వాదించారు.
కొనసాగనున్న ఉత్కంఠ: ప్రాజెక్టు వైఫల్యాల వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకే ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం రికార్డుల ఆధారంగానే విచారణ జరుగుతోందని చెబుతోంది. పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలను కూడా కోరామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మార్చి 12న అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తుది తీర్పును హైకోర్టు ధర్మాసన వెల్లడించాల్సి ఉంది. కానీ తీర్పును మరో రెండు వారాలపాటుగా వాయిదా వేశారు. ఈ వాయిదాతో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల్లో మరో రెండు వారాల పాటు ఉత్కంఠ కొనసాగనుంది.

