Karimnagar: కరీంనగర్ రాజకీయ రణరంగంగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు మెరుపు దాడికి దిగారు.
అసలేం జరిగిందంటే: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్దఎత్తున నిరసనకారులు క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో ఆఫీసులోని ఫర్నిచర్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కార్యాలయం వెలుపల ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను సైతం పగులగొట్టారు.
Also Read-Bandi Sanjay: ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్!
అదుపుతప్పిన బీజేపీ కార్యకర్తలు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై భౌతిక దాడికి ఆందోళనకారులు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది అతికష్టం మీద ఆయనను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం కరీంనగర్‌లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కాస్తా వీధి పోరాటంగా మారడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

