★ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు
అనంతపురం, (తెలుగు ప్రభ): శింగనమల నియోజకవర్గ పరిధిలోని అలంకారాయునిపేట గ్రామానికి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, వాటర్ ట్యాంక్, బస్టాండ్ ప్రారంభోత్సవాలతో పాటు నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. హోంమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో అలంకారాయునిపేటలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లను మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, అనంతపురం జిల్లా ఎస్పీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రజలు కూర్చునే ప్రదేశాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి స్థానిక అధికారులతో సమీక్షించారు.హోంమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

సభా ప్రాంగణంలో అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

