NEET-PG exam: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఆధ్వర్యంలో ఆదివారం (ఆగస్టు 30) జరగనున్న ‘నీట్ – పీజీ 2026’ పరీక్షను పురస్కరించుకుని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) – 2023లోని సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడటం, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడంపై పూర్తిగా నిషేధం విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది, సైనిక బలగాలు మరియు హోంగార్డులకు మాత్రమే ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఉంటుంది. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు అభ్యర్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

