Karnataka: వస్త్రాధారణ భార్యాభర్తల మధ్యల గొడవకు కారణం అయ్యింది. భార్య నైటీ ధరించిందనే కోపంతో భర్త ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగుచూసింది.
అసలేం జరిగిందంటే: భార్య నైటీ ధరించిందనే కోపంతో భర్త ఆమెపై కిరోసిన్ పోశాడు. కృష్ణాజీ పాటిల్ (29), మంజులా పాటిల్ (27) దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలీ పని చేస్తూ కృష్ణాజీ.. తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదట్లో వీరి జీవితం అన్యోన్యంగా సాగింది. అయితే ఇటీవల వారి దాంపత్యంలో నైటీ వివాదంగా మారింది. తన భార్య మంజుల ఇంట్లో ఎప్పుడూ చీరలే కట్టుకోవాలని కృష్ణాజీ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అయితే ఆమెకు ఇంట్లో నైటీలు ధరించడం ఇష్టం. కానీ ఆమె నైటీలు ధరించడం అతనికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఈ విషయంలో వారి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!: బుధవారం మరోసారి ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భార్య తన మాటను ఖాతరు చేయలేదన్న కోపంతో కృష్ణాజీ విచక్షణ కోల్పోయాడు. రాక్షసుడిలా మారిన అతను.. మంజులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న భార్య.. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పేసి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also read-Relationship: మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా?.. అయితే ఇట్టే గుర్తుపట్టొచ్చు!
విషమంగా భార్య పరిస్థితి: మంజుల దాదాపు 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు కృష్ణాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.

