Chandrashekar Pole Death: అమెరికా టెక్సాస్ సిటీలో ఘోరంగా కాల్చి హత్యకు గురైన తెలుగు యువకుడు పోలే చంద్రశేఖర్. హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల చంద్రశేఖర్ అమెరికాలో పీజీ చదువుకుంటూ, టెక్సాస్ ప్రాంతంలో ఒక గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం ఉద్యోగిగా కూడా పనిచేస్తున్నాడు. 2025 అక్టోబర్ 4వ తేదీ తెల్లవారుజామున గ్యాస్ కోసం వచ్చిన నల్ల జాతీయుడు కాల్పులు జరపటంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘాతుక ఘటనకు సంబంధించిన అమెరికా అధికారులు వివరాలు వెల్లడించారు.
పోలే చంద్రశేఖర్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్, మీర్ పేట్ టీచర్స్ కాలనీలో ఉంటోంది. తమ కుమారుడు F1 వీసాతో రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి చదువుకుంటూ, మరోపక్క అక్కడి ఖర్చులను భరించేందుకు వీలుగా ఆదాయం కోసం గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాలో తెలుగువారిపై వీసా ఇష్యూలు, ఉద్యోగ సంక్షోభాలు, జాత్యహంకార హత్యలు వంటి సంఘటనలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. కొన్ని రోజుల కింద అమెరికాలోని ఒక మోటల్ మేనేజర్ హత్యలో నిందితుడు తల నరికి విసిరేసిన అందరినీ గగుర్పాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలో జరిగిన ఘటనపై అక్కడి తెలుగు సంఘాలు స్పందించి.. చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావడానికి సహాయం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిబంధనలు, నిర్ణయాలు అమెరికాలోని కేవలం భారతీయులనే కాకుండా విదేశాలకు చెందిన చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉపాధి భద్రతపై కలవరం కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు అమెరికాలో భారతీయుల భద్రత, జీవన పరిస్థితుల విషయంలో సీరియస్ ప్రశ్నలు కలిగిస్తున్నాయి.


