Ameenpur: రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) తన ఉక్కుపాదం కొనసాగిస్తోంది. శనివారం ప్రారంభమైన ఈ భారీ ఆపరేషన్ ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు.
G+5 భవనం కూల్చివేత: ఐలాపూర్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న G+5 భవనాన్ని అధికారులు ఆదివారం కూల్చివేశారు. శనివారం సైతం ముఖీమ్ గెస్ట్ హౌస్‌తో పాటు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అజీమ్ అనే వ్యక్తి నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ఐలాపురం గ్రామంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఇప్పటికే అనేక నివాసాలు వెలిశాయి. అయితే ప్రస్తుతం నివసిస్తున్న సామాన్యుల ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. మిగిలి ఉన్న 860 ఎకరాల ఖాళీ ప్రభుత్వ భూమిని కాపాడటమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోంది.
రూ. 15,000 కోట్ల విలువైన భూమి స్వాధీనం: స్వాధీనం చేసుకుంటున్న 863 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 15,000 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ఐలాపురం తండా మరియు గ్రామ నివాసాలను డిస్టర్బ్ చేయకుండా కేవలం అక్రమంగా వెలిసిన భారీ కట్టడాలను, ఖాళీ స్థలాలను మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. మున్సిపల్, రెవెన్యూ విభాగాల సమన్వయంతో ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

