IAF fighter squadron shortage and annual aircraft requirements : సరిహద్దుల్లో కారాలూ మిరియాలూ నూరుతున్న శత్రు మూకల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే భారత వాయుసేన అమ్ములపొదిలో అస్త్రాలు తరిగిపోతున్నాయా? సార్వభౌమాధికార రక్షణలో తిరుగులేని కంచుకోటగా నిలిచే మన గగనతల రక్షకులకు ‘స్క్వాడ్రన్ల కొరత’ గుదిబండగా మారుతోందా? వైమానిక దళ వార్షిక మీడియా సమావేశంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
క్షీణిస్తున్న బలం.. పెరగాల్సిన విమానాలు: దేశ సైనిక పాటవంలో వాయుసేన పాత్ర అత్యంత కీలకమని, ప్రస్తుత కొరతను అధిగమించాలంటే ఏటా కనీసం 36 నుంచి 40 కొత్త యుద్ధ విమానాలను చేర్చుకోవాల్సిందేనని ఐఏఎఫ్ అధిపతి తేల్చిచెప్పారు. కాలం చెల్లిన మిగ్ విమానాల నిష్క్రమణతో తగ్గిపోతున్న స్క్వాడ్రన్ల సంఖ్యను తిరిగి గాడిన పెట్టేందుకు వేగవంతమైన ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు.
జాప్యం జరిగితే ప్రత్యామ్నాయ మార్గాలు: స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఐదో తరం ‘అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రాజెక్టులో జాప్యం జరిగితే, తాము ఇతర విదేశీ ప్లాట్‌ఫామ్‌లపై దృష్టి సారించక తప్పదని హెచ్చరించారు. రష్యా తమ సుఖోయ్-57 (Su-57) విమానాన్ని ప్రతిపాదించినప్పటికీ, దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఎంఆర్‌ఎఫ్‌ఏ, సరికొత్త సాంకేతికత: 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) ప్రాజెక్టు ధరల చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని, అనుకున్నట్లు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ మెగా ఒప్పందం ఖరారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వాయుసేనగా ఎదగడమే కాక, ‘సమగ్ర దేశ విధానం’ ద్వారా స్వయం సమృద్ధిని సాధిస్తామని ఉద్ఘాటించారు.

