Heavy rains: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించకముందే.. లక్షద్వీప్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మేఘాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఏపీ, తెలంగాణల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణకు రెయిన్ అలర్ట్: తెలంగాణలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కాగా.. రానున్న 24 గంటల్లోనూ ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుల హెచ్చరిక: ఏపీ వాతావరణ శాఖ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలకు కీలక సూచనలు:
- ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
- వర్షం, ఈదురుగాలులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడకూడదు.
- బలమైన గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ.. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.

