Yellow alert: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్న వేళ వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 24 గంటల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. అంతేకాకుండా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సైతం వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
18 జిల్లాలకు ఎల్లో అలర్ట్: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మొత్తం 18 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, జనగామ, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో.. అధికారులు ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద తలదాచుకోవద్దని అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ మరియు విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరించారు.

