Health advisory: రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. తీవ్రమైన ఎండల నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వైద్యారోగ్య శాఖ జారీ చేసిన ముఖ్య సూచనలు:
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- దాహం వేయకపోయినా నీరు, ఓఆర్‌ఎస్ (ORS), మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు తరచూ తాగుతుండాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా తాగునీటిని వెంట ఉంచుకోవాలి.
- పుచ్చకాయ, కీరదోస వంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
- తేలికపాటి నూలు (కాటన్) దుస్తులు ధరించాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, చెప్పులు తప్పనిసరిగా వాడాలి.
- పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచి, రాత్రి వేళల్లో చల్లని గాలి కోసం వాటిని తెరిచి ఉంచాలి.
- వికారం, వాంతులు, చర్మం పొడిబారడం, శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి.
చేయకూడని అంశాలు:
- మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లడం, శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం నివారించాలి.
- ఎండ వేడిమి ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడం తగ్గించుకోవాలి.
- శరీరంలో నీటి శాతాన్ని తగ్గించే మద్యం, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. అలాగే ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు ఉన్న నిల్వ ఆహారానికి దూరంగా ఉండాలి.
ముందస్తు ఏర్పాట్లు చేసిన వైద్యారోగ్య శాఖ: తీవ్ర ఎండల దృష్ట్యా వైద్యారోగ్య శాఖ అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీల వద్ద ఓఆర్‌ఎస్ (ORS) ప్యాకెట్లను ఉంచినట్లు డాక్టర్ బి. రవీందర్ నాయక్ స్పష్టం చేశారు.

