Special Intensive Revision voter deletion inquiry : భారత ప్రజాస్వామ్య సౌధానికి ప్రాణవాయువైన ఓటు హక్కుపై పడిన నీలి నీడలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్ – SIR) ప్రక్రియలో పెద్దయెత్తున ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
న్యాయకోవిదుల ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్ : ఈ సంక్షోభంపై ‘లాయర్స్ అసోసియేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్’ (LAFC) రంగంలోకి దిగింది. సర్ రాజ్యాంగబద్ధతను, విధివిధానాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె. పట్నాయక్, జస్టిస్ బదర్ దుర్రెజ్ అహ్మద్, జస్టిస్ రేఖా శర్మ, జస్టిస్ అంజనా ప్రకాశ్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ తదితరులు వ్యూహాత్మక సలహాలు అందిస్తారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి, బాధితుల వాంగ్మూలాలు సేకరించి డిసెంబరు నాటికి నివేదిక సమర్పించనుంది.
ఈసీ దిద్దుబాటు చర్యలు.. ‘స్పెషల్ డ్రైవ్’ : మరోవైపు, 20కి పైగా రాష్ట్రాల్లో పూర్తయిన సర్ ప్రక్రియపై విపక్షాలు, పౌరసమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తొలగించిన అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. పాత జాబితాతో సరిపోల్చి, అర్హులైన పౌరులతో తక్షణమే ‘ఫారం-6’ దరఖాస్తులు చేయించి ఓటర్లుగా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఓటర్ల జాబితా పారదర్శకతపై సరికొత్త చర్చకు తెరతీశాయి.

