HomeTop StoriesODI: నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే.. అందరి దృష్టి ఆ ఆటగాడి పైనే!

ODI: నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే.. అందరి దృష్టి ఆ ఆటగాడి పైనే!

IND Vs AFG: టీమిండియా మరో కొత్త సమరానికి సిద్ధమైంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌ నేడు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో నేడు తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. జట్టు మేనేజ్‌మెంట్‌ మాత్రం వన్డే ప్రపంచకప్‌-2027 కోసం పటిష్టమైన జట్టును నిర్మించడంపైనే ఉంది. అందులో భాగంగా పలువురు ఆటగాళ్ల సామర్థ్యం, ఫిట్‌నెస్‌పై ఈ సిరీస్‌తో ఓ అంచనాకు రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

అందరి దృష్టి అతడిపైనే!: వన్డే ప్రపంచకప్‌-2027 ప్రణాళికల్లో భాగంగా ఈ సిరీస్‌ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా.. ప్రపంచకప్‌కు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై మేనేజ్‌మెంట్‌ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో సీనియర్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ భవితవ్యం సైతం తేలనుంది. ప్రస్తుతం అతడు ప్రపంచకప్‌ ప్రణాళికల్లోనే ఉన్నప్పటికీ.. జోరుమీదున్న కుర్రాళ్లతో పోటీపడి పరుగులు సాధించగలడా అనేది ప్రశ్న. ఇటీవలే ఐపీఎల్‌లో తొడ కండర గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్‌, ఈ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఏ మేరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.

కీలకంగా మారనున్న మూడో స్థానం: రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. దీంతో మూడో స్థానంలో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. అయిత, ఈ మూడు వన్డేల సిరీస్‌లో రాహుల్‌తో పాటు యశస్వి జైస్వాల్, ఇషాన్‌లను కూడా మూడో స్థానంలో పరీక్షించబోతున్నట్లు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్పష్టం చేశాడు. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో స్థానంలో రానున్నాడు.

పేస్ అనుకూలంగా పిచ్‌: ధర్మశాల పిచ్‌ ఎప్పుడూ పేస్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ కొత్త బంతితో స్వింగ్‌ లభిస్తుంది. కాబట్టి పవర్‌ప్లేలో బ్యాటర్లకు పరీక్ష తప్పదు. అయితే క్రీజులో కుదురుకుంటే భారీగా పరుగులు సాధించవచ్చు. టాస్ గెలిచిన జట్టు ఇక్కడ చేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్‌లో ఇప్పటివరకు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 5 సార్లు, మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 4 సార్లు విజయం సాధించాయి.

ఇరు జట్ల అంచనా:

  • భారత్: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ప్రిన్స్‌/గుర్నూర్‌ బ్రార్‌.
  • అఫ్గానిస్థాన్‌: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్‌ షా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, అలీఖిల్, రషీద్ ఖాన్, మహ్మద్‌ సలీమ్, జియావుర్‌ రెహ్మాన్, ఏఎం ఘజన్‌ఫర్‌.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News