India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా అసలైన పరీక్షను ఎదుర్కోబోతోంది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే నేడు చెపాక్ వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కేవలం విజయం మాత్రమే సరిపోదు. గెలుపు అనేది అత్యంత భారీ తేడాతో ఉంటేనే భారత్‌కు సెమీస్ ఆశలు సజీవం. నెట్ రన్ రేట్(-3.80) అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో భారీ తేడాతో గెలవడం టీమ్ ఇండియాకు అనివార్యం.
ఆందోళనలో జట్టు మేనేజ్‌మెంట్: ప్రస్తుత టోర్నీలో టీమ్ ఇండియాను బ్యాటింగ్ వైఫల్యాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ పేలవ ప్రదర్శన జట్టుకు శాపంగా మారింది. విధ్వంసానికి పెట్టింది పేరైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 4 మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇందులో మూడు డకౌట్లు ఉండటం గమనార్హం. దీంతో టీం మేనేజ్‌మెంట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ (127), తిలక్ వర్మ (118) పరుగులు చేస్తున్నప్పటికీ.. టీ20 ఫార్మాట్‌కు తగ్గ వేగంతో ఆడలేకపోవడం జట్టు స్కోరుపై ప్రభావం చూపుతోంది.
జట్టులో కీలక మార్పులు?: జింబాబ్వే స్పిన్ అస్త్రాన్ని ఎదుర్కోవడానికి టీం మేనేజ్‌మెంట్ కీలక మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తోంది. కుడి, ఎడమ కాంబినేషన్ కోసం జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. అభిషేక్ శర్మకు జోడీగా సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపే యోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిన రింకూ తిరిగి వచ్చినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో అతనికి అవకాశం దక్కడం అనుమానమే.
జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం: గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన జింబాబ్వే.. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సికందర్ రజా నేతృత్వంలోని ఆ జట్టు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. బెనెట్, మరుమాని, ముజరబాని వంటి ఆటగాళ్లతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.
Also read-Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సెంచరీ.. 100 మిలియన్ల ఫాలోవర్లతో రికార్డు!
బ్యాటర్లకు స్వర్గధామం: చెన్నైలోని చెపాక్ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే పేరుంది. అయితే ఈ టోర్నీలో మాత్రం బ్యాటర్లకు బాగా సహకరిస్తోంది. గత మ్యాచ్‌ల్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేకపోవడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం.

