India zero tolerance policy on terrorism at UN : ‘ఉగ్రవాదానికి చోటు లేదు.. ముష్కర మూకల ఆగడాలకు క్షమాభిక్ష అంతకంటే లేదు’ అంటూ ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా భారత్ విస్పష్టంగా చాటిచెప్పింది. రక్తపాతాన్ని సృష్టిస్తున్న టెర్రరిజంపై రాజీలేని ‘జీరో టాలరెన్స్’ సమరానికి కట్టుబడి ఉన్నామని పిలుపునిచ్చింది. సీమాంతర ఉగ్రవాదం కోరలు చాస్తున్న వేళ, ప్రపంచ వేదికపై భారత్ సంధించిన ప్రశ్నలు ఏమిటి? ముష్కరులకు స్వర్గధామంగా మారిన పొరుగు దేశం ద్వంద్వ నీతిని ఢిల్లీ దౌత్యం ఎలా కడిగిపారేసింది?
రాజీలేని పోరు.. స్పష్టమైన వైఖరి: న్యూయార్క్‌లో పర్యటిస్తున్న రాజ్యసభ ఎంపీ సికిందర్ కుమార్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం, ఐరాస ఉగ్రవాద నిరోధక కార్యాలయ (UNOCT) తాత్కాలిక అండర్ సెక్రటరీ జనరల్ అలెగ్జాండర్ జుయెవ్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ, ఏ కారణంతోనూ సమర్థించలేమని భారత్ తేల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రాయోజిత, సీమాంతర ఉగ్రవాద వ్యవస్థలపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సైబర్ స్పేస్ దుర్వినియోగం, నిధుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అంతర్జాతీయ సమన్వయం అత్యవసరమని నొక్కిచెప్పింది.
పాక్ ద్వంద్వ నీతిపై నిప్పులు: మరోవైపు ఐరాస ఆరో కమిటీ సమావేశంలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘూ పూరీ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “తాము పెంచి పోషించిన ఉగ్రభూతమే ఇప్పుడు తమనే వెంటాడుతోందని పాక్ నాయకత్వమే ఒప్పుకుంటోంది” అని చురకలు అంటించారు. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్‌కు రక్షణ, రివార్డులు కల్పించిన చరిత్ర పాక్‌దని దుయ్యబట్టారు. 9/11, 26/11, పహల్గాం దాడుల చేదు జ్ఞాపకాలను ప్రపంచం విస్మరించలేదని, ఉగ్రవాదాన్ని కేవలం ఉపన్యాసాలతో కాకుండా పక్కా చర్యలతోనే నిర్మూలించగలమని భారత్ గట్టిగా హెచ్చరించింది.

