Indian government: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ నివసిస్తున్న భారతీయులు వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచిపెట్టి స్వదేశానికి రావాలని సూచించింది. ఈ మేరకు బుధవారం భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అడ్వైజరీని విడుదల చేసింది.
ఎంబసీ జారీ చేసిన కీలక సూచనలు: రాయబార కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి లేదా సమాచారం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ సరిహద్దుల సమీపంలోకి వెళ్లవద్దని పౌరులకు సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్నవారు విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు మరియు బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. అనవసర ప్రయాణాలు మానుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరింది. ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. ఈ విరామాన్ని వినియోగించుకుని స్వదేశానికి చేరుకోవడం ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు.
Also read-Hormuz Strait: హార్మూజ్ రీ ఓపెన్‌కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
రెండు వారాలు విరమణ: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ ప్రపంచానికి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య 14 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హార్మూజ్ జలసంధిని (Strait of Hormuz) రెండు వారాల పాటు తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ సైన్యంతో సమన్వయం చేసుకుంటూ.. కాల్పుల విరమణ అమల్లో ఉన్న 14 రోజులు హార్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు.

