Markets Bull Rally: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా భారతదేశంతో త్వరలోనే ట్రేడ్ డీల్ ఫైనల్ కాబోతుందంటూ దక్షిణ కొరియా పర్యటనలో చేసిన కామెంట్స్ భారత మార్కెట్లను బుల్ జోరుతో నింపాయి. భారత ప్రధాని మోదీపై ఆయన గుప్పించిన పొగడ్తలు బీటలు వారిన వాణిజ్య బంధం తిరిగి మెరుగుపడుతున్నట్లు సంకేతాలను పంపించింది.
దీంతో ఇవాళ మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 110 పాయింట్లకు పైగా గెయిన్ అయ్యింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 170 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు కూడా పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, మీడియా రంగాలకు చెందిన షేర్లు లాభాల బాట పట్టాయి.
ఉదయం ట్రంప్ కామెంట్స్ వార్తా కథనంగా బయటకు వచ్చిన తర్వాత సీఫుడ్, టెక్స్ టైల్ రంగాలకు చెందిన షేర్లలో కూడా భారీ ర్యాలీ కనిపించింది. ప్రస్తుతం ట్రంప్ విధిస్తున్న 50 శాతం సుంకాలతో ఎగుమతులు నిలిచిపోయిన పరిస్థితి త్వరలోనే ట్రేడ్ డీల్ తర్వాత మెరుగుపడుతుందని ఇన్వెస్టర్లలో నమ్మకాలు నిండటంతో స్టాక్స్ గెయిన్ అయ్యాయి. దీంతో ఎపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, కోస్టల్ కార్పొరేషన్, అవంతి ఫీడ్స్, గోకల్ దాస్ ఎక్స్ పోర్ట్స్, పెర్ల్ ఇండస్ట్రీస్, రేమాండ్, కేపీఆర్ మిల్స్ కంపెనీ షేర్లు 4 శాతం వరకు పెరుగుదలను చూశాయి ఇంట్రాడేలో.
ఇవాళ మార్కెట్లలో కేవలం ఆటో సెక్టార్ మినహా దాదాపుగా అన్ని రంగాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. ప్రధానంగా ఇవాళ మార్కెట్ల ర్యాలీకి.. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, NTPC, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, HCL టెక్నాలజీస్, టాటా స్టీల్ వంటి హెవీవెయిట్ స్టాక్స్ కారణంగా రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ వెల్లడించారు. దీనికి అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆశావాదం ప్రధాన ప్రేరణగా నిలిచిందని ఆయన చెప్పారు. దీనికి తోడు అమెరికా ఈక్విటీల్లో స్థిరమైన లాభాలు, గ్లోబల్ టెక్ స్టాక్‌లలో AI నేతృత్వంలోని ర్యాలీ వంటి బలమైన ప్రపంచ సంకేతాలు బుల్లిష్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయని ఆయన వెల్లడించారు. అలాగే వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన కోసం కూడా ఇన్వెస్టర్లు వేచి చూస్తుండటం మరో కారణంగా చెప్పుకోవచ్చు


