Tuesday, December 9, 2025
HomeTop StoriesCold Weather: బెంబేలెత్తిస్తోన్న చలి పులి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Cold Weather: బెంబేలెత్తిస్తోన్న చలి పులి.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Cold wave in telangana: రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి ప్రభావం అధికంగా ఉంది. రాబోయే మూడు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దీంతో వాతావరణ శాఖ పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, మెదక్‌, నిర్మల్‌, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్‌, ములుగు జిల్లాలకు రాబోయే మూడు రోజులకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 6 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సిర్పూర్‌లో అత్యల్పం: ఎముకలు కొరికే చలి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ నమోదవుతూ వస్తున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత (7.4 డిగ్రీ సెల్సియస్) నమోదైంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. దుబ్బాక ప్రాంతంలో ఉష్ణోగ్రత లెవెల్స్ తీవ్రంగా పడిపోయాయి. హైదరాబాద్‌ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నగర శివారు ప్రాంతమైన శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శివారు ప్రాంతాలు, వృక్షాలు అధికంగా ఉన్న చోట ఉదయం పూట దట్టమైన పొగమంచు అలముకుంటోంది.

Also Read:https://teluguprabha.net/telangana-news/cybercrime-police-blocked-ibomma-and-bappam-websites/

ప్రజలకు సూచనలు: నవంబర్ నెలలోనే చలి ఇంత తీవ్రంగా ఉండటంతో.. జనవరి, ఫిబ్రవరి మాసంలో చలి తీవ్రతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా, నిపుణులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా స్వెటర్లు, క్యాప్‌లు ధరించాలని వైద్యులు సూచించారు. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు చలి మంటలు కాచుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News