Intermediate Admissions: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తరగతులు జూన్ 1 నుండి ప్రారంభం కానున్నట్లుగా బోర్డు కార్యదర్శి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్ల కోలాహలం: పాఠశాల విద్యలో ఇంటర్ విలీనంపై ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష అనంతరం ఈ విద్యా సంవత్సరం పాత పద్ధతిలోనే అడ్మిషన్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. గతంలో మే 8నే ప్రవేశాలు ప్రారంభం కావాల్సి ఉన్నా.. విలీన ప్రక్రియపై చర్చల నేపథ్యంలో షెడ్యూల్ తాత్కాలికంగా వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్ల కోలాహలం మొదలుకానుంది.
Also read-Education Week: విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం- సీఎం రేవంత్
యాంటీ డ్రగ్ అఫిడవిట్ తప్పనిసరి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది కొత్త నిబంధనను చేర్చింది. తాము మత్తు పదార్థాలను వినియోగించబోమని, విక్రయించబోమని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సంతకం చేసిన అఫిడవిట్‌ను కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అడ్మిషన్ కోసం విద్యార్థి ఆధార్ నంబర్‌ను తప్పనిసరి సమర్పించాల్సి ఉంటుంది.

