GT Vs RCB: దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-2026 మహాసంగ్రామం ఇప్పుడు ముగింపు ఘట్టానికి చేరుకుంది. ఎన్నో సంచలనాలు, ఉత్కంఠభరిత పోరాటాల నడుమ నేటి నుంచి ప్లేఆఫ్స్ సమరానికి తెరలేవనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనుంది. లీగ్ దశలో ఇరు జట్లూ చెరో 18 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినప్పటికీ.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ విజేతతో తలపడాల్సి ఉంటుంది.
జోరు మీదున్న టైటాన్స్: ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే ఒకసారి ఛాంపియన్‌గా, నాలుగు సార్లు ప్లేఆఫ్స్ చేరిన ఘనత గుజరాత్‌ది. ఈ సీజన్ ఆరంభంలో తడబడినప్పటికీ ద్వితీయార్ధంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (638 పరుగులు), శుభ్‌మన్ గిల్ (616 పరుగులు) టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన టాప్-2 బ్యాటర్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మూడో స్థానంలో జోస్ బట్లర్ (469 పరుగులు) సైతం రాణిస్తుండటం జట్టుకు పెద్ద సానుకూలాంశం. అయితే మిడిల్ ఆర్డర్ వైఫల్యం జట్టును కాస్త కలవరపెడుతోంది. రబాడ (24 వికెట్లు), రషీద్ ఖాన్ (19 వికెట్లు), సిరాజ్ (17 వికెట్లు)లతో గుజరాత్ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నైపై 89 పరుగుల భారీ విజయం సాధించి జీటీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.
నిలకడకు మారుపేరు ఆర్సీబీ!: గత సీజన్ విజేత బెంగళూరు.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో అత్యంత నిలకడైన జట్టుగా నిలిచింది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీకి విరాట్ కోహ్లి ప్రధాన బలంగా మారాడు. కోహ్లి 14 మ్యాచ్‌ల్లో 50.63 సగటుతో 557 పరుగులు (1 శతకం, 4 అర్ధశతకాలు) చేసి ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారాడు. దేవదత్ పడిక్కల్ (433 పరుగులు) కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఫిలిప్ సాల్ట్ గాయంపై సందిగ్ధత ఉండటంతో.. వెంకటేష్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, కృనాల్ పాండ్యాలు అతనికి చక్కటి సహకారం అందిస్తున్నారు.
ముఖాముఖి రికార్డులు: ఇరు జట్ల మధ్య రికార్డులు సమంగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన 8 ముఖాముఖి పోరుల్లో చెరో 4 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఈ సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెరో విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
పిచ్ రిపోర్ట్: ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఇక్కడి ఔట్‌ఫీల్డ్ చాలా చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
- బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్/వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్.
- గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాతియా, నిశాంత్ సింధు, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, సాయికిశోర్/మానవ్ సుతార్.

