Hormuz Strait: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ ప్రపంచానికి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య 14 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హార్మూజ్ జలసంధిని (Strait of Hormuz) రెండు వారాల పాటు తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ సైన్యంతో సమన్వయం చేసుకుంటూ.. కాల్పుల విరమణ అమల్లో ఉన్న 14 రోజులు హార్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఒప్పందంలోని కీలక అంశాలు: ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని రానున్న 14 రోజుల పాటు తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్‌తో.. సాంకేతిక పరిమితులకు లోబడి నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు ఆపివేస్తే.. తాము కూడా దాడులు నిలిపివేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపేలా ఇరాన్ ముందుకు తెచ్చిన 10 పాయింట్ల ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది.
Also read-America- Iran War: ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం అలర్ట్
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో 14 రోజుల పాటు దాడులను నిలిపివేసేందుకు అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా ఇరాన్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు సైతం అమెరికా సానుకూలంగా ఉందని తెలుస్తోంది. ఈ తాత్కాలిక విరామం వల్ల ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు స్థిరపడే అవకాశం ఉంది. అంతేకాకుండా తదుపరి చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం జరగాలని యావత్ ప్రపంచం ఆశిస్తోంది.

