Ali Khamenei: పశ్చిమ ఆసియాలో యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెలువడుతున్న వార్తలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఖమేనీ మృతి చెందడాన్ని ఆ దేశం ధ్రువీకరిస్తూనే తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.
మహానేరంగా అభివర్ణించిన ఇరాన్ కేబినెట్: ఖమేనీ మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం ఒక మహానేరంగా అభివర్ణించింది. ఈ దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆ దేశ కేబినెట్ స్పష్టం చేసింది. మా సర్వోన్నత నేతను హతమార్చిన వారికి సరైన సమాధానం చెబుతామని పేర్కొంది. ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇరాన్ మంత్రుల మండలి హెచ్చరించింది.
రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక: ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సైన్యం ఏ క్షణమైనా ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం “ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్” (IRGC) ఈ ఘటనపై భీకర ప్రకటన విడుదల చేసింది. మా సుప్రీం నేతను చంపిన వారికి తీవ్రమైన శిక్ష విధిస్తామని పేర్కొంది. శత్రువుల గుండెల్లో నిద్రపోతామని తెలిపింది. ఈ దాడికి వ్యూహకర్తలుగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌లకు కోలుకోలేని దెబ్బ తీస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
Also read-Khamenei: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఇరాన్!
అంతర్జాతీయంగా ఆందోళన: ఖమేనీ మృతితో ఇరాన్ తన అణ్వాయుధ మరియు సైనిక శక్తిని ఉపయోగించి పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే దుబాయ్ వంటి కీలక ప్రాంతాల్లో విమానాశ్రయాలు మూతపడటం, చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచం దృష్టి ఇప్పుడు టెహ్రాన్ వైపు మళ్లింది.

