Iran missile attack: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు భీకర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ గుండెకాయ వంటి జెరూసలేం నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో జెరూసలేం సమీపంలోని బీట్ షెమేష్ (Beit Shemesh) ప్రాంతంలో ఒక క్షిపణి నేరుగా నివాస భవనాన్ని ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 27 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
జెరూసలేం అంతటా సైరన్లు మోత: పశ్చిమ జెరూసలేంలోని నివాస ప్రాంతాలపై పడ్డ క్షిపణుల ధాటికి భారీ పేలుడు సంభవించింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా జెరూసలేం అంతటా ఎయిర్-రైడ్ సైరన్లు మోగడంతో వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో బంకర్ల వైపు పరుగులు తీశారు.
Also read-Iran: ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రతీకార జ్వాలలు.. అమెరికా బేస్‌లే లక్ష్యంగా క్షిపణి దాడులు.!
పవిత్ర స్థలాలకు పొంచి ఉన్న ముప్పు: ఈ దాడి కేవలం ప్రాణనష్టానికే పరిమితం కాకుండా మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి శకలాలు పాత జెరూసలేం నగరంలోని అత్యంత పవిత్రమైన ‘టెంపుల్ మౌంట్’, ‘అల్-అక్సా మసీదు’కు అతి సమీపంలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పవిత్రమైన ఈ ప్రాంతాలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ యొక్క అత్యాధునిక రక్షణ కవచాలైన ‘ఆరో’ (Arrow), ‘డేవిడ్స్ స్లింగ్’ (David’s Sling) అనేక క్షిపణులను గాలిలోనే అడ్డుకున్నప్పటికీ, కొన్ని క్షిపణులు మరియు వాటి శకలాలు నగరంపై పడటాన్ని నిపుణులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

