T. Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమని టి. జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కంటే కేసీఆర్ పాలన చాలా చాలా బెటర్ అని అన్నారు. రేవంత్ పాలన విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
రేవంత్ పాలనపై కార్యకర్తల్లో అసంతృప్తి: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేదని తెలిపారు. వారిపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలో ఇంతలా అసంతృప్తితో ఉంటే ఇక.. యావత్ తెలంగాణ ప్రజలు ఎంతలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని జీవన్ రెడ్డి అన్నారు. మార్పు కావాలని ప్రజలు కోరుకుంటే.. ఉన్న పథకాలు పోయాయని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తెలిపారు.
కేసీఆర్ పాలనపై ప్రశంసల జల్లు: రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఎప్పుడూ ఆపలేదని జీవన్ రెడ్డి అన్నారు. అయితే రేవంత్ పాలనలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతులు ఆనందంతో ఉండేవారని అన్నారు. రైతుబంధు పేరుతో రైతు సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీఠ వేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సాగుపరిధి పెరిగిందని అన్నారు. అయితే కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా కేసీఆర్ తనకు దశాబ్దాల కాలంగా మిత్రుడని తెలిపారు. అందుకే ఆయనతో కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని వ్యాఖ్యానించారు.
Also read-Telangana: తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు.. జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్!
బీజేపీ కంటే బీఆర్‌ఎస్ బెటర్: తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ కంటే బీఆర్‌ఎస్ పార్టీయే ఎంతో మేలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ను గద్దె దించడం కేవలం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండున్నరేళ్లు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడటం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ కాగా.. బీఆర్‌ఎస్‌కు కొత్త ఊపిరి పోసినట్లయింది. ఆయన చేరికపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

