JEE Advanced results: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, కఠినమైన ప్రవేశ పరీక్షగా భావించే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced-2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఐఐటీ రూర్కీ (IIT Roorkee) తన అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల స్కోర్‌కార్డులు, ర్యాంకులను ప్రకటించింది. ఈ ఏడాది ఫలితాల్లో ఐఐటీ దిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
క్రమశిక్షణతో కూడిన సన్నద్ధతే విజయ రహస్యం: టాపర్‌గా నిలిచిన శుభమ్ కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా. ఆయన గతంలో జరిగిన జేఈఈ మెయిన్స్ (JEE Main) పరీక్షలోనూ 300కి 300 మార్కులు సాధించి.. 100 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌లోనూ టాప్ ర్యాంక్ సాధించి తన సత్తా చాటారు. రాజస్థాన్ లోని కోటాలో రెండేళ్లపాటు సాగిన కఠోర శ్రమ, క్రమశిక్షణతో కూడిన సన్నద్ధతే విజయ రహస్యమని శుభమ్ అన్నారు. కుటుంబ సభ్యుల నిరంతర ప్రోత్సాహమే తన ఈ విజయానికి కారణమని ఆనందం వ్యక్తం చేశారు. శుభమ్ కుమార్ తండ్రి శివ్ కుమార్ ఒక చిన్న హార్డ్‌వేర్ దుకాణాన్ని నిర్వహిస్తుండగా, తల్లి కంచన్ దేవి గృహిణి.
ఫలితాలు చెక్ చేసుకోండిలా: విద్యార్థులు తమ స్కోర్‌కార్డుల కోసం మొదటగా జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న JEE Advanced Result 2026లింక్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేయండి. స్క్రీన్‌పై మీ స్కోర్‌కార్డ్ ప్రత్యక్షమవుతుంది.
త్వరలో జోసా(JoSAA) కౌన్సెలింగ్: ఫలితాల విడుదల పూర్తికావడంతో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

