Jnaneswari missing case: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కల్గిస్తుంది. కళ్లెదుటే ఆడుకుంటూ కనిపించకుండా పోయిన కూతురి కోసం తల్లిదండ్రులు గణేష్, భవాని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు, ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో గాలిస్తున్నా చిన్న ఆధారం కూడా దొరకకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది.
ముమ్మరంగా సాగుతున్న అన్వేషణ: జూన్ 6వ తేదీ ఉదయం 11:50 గంటల సమయంలో చిన్నారి జానూ తన తండ్రి కోసం పెంపుడు కుక్కతో కలిసి తోటలోకి వెళ్తూ అదృశ్యమైంది. సుమారు 30 నిమిషాల తర్వాత చిన్నారి తోట, కొండ ప్రాంతం సరిహద్దులో కనిపించిందని ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో గాలింపు ప్రారంభించారు. అయితే విచిత్రంగా చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అదే రోజు గ్రామంలో ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీన్ని బట్టి చిన్నారి వెంట కుక్క లేదని, ఆమె ఎవరి చేతిలోనైనా చిక్కిందా లేదా మరేదైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి అదృశ్యమైన రాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని మార్గాల్లో అన్వేషణ సాగించారు. గాలింపు బృందాలు: ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), అటవీ శాఖ, హనుమాన్ బృందాలు కొండలు, తోట ప్రాంతాలను పూర్తిగా జల్లెడ పట్టాయి. రాత్రి వేళల్లో వెతకడానికి థర్మల్ డ్రోన్లను ఉపయోగించారు. సీసీ కెమెరా దృశ్యాలతో పాటు, స్థానిక ఏడు మొబైల్ టవర్ల పరిధిలోని వందలాది ఫోన్ కాల్స్‌ను పోలీసులు విశ్లేషించారు. పరిసర ప్రాంతాల్లోని ఓపెన్ బావులు, బోరుబావులు, చెరువులను కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
రూ. లక్ష బహుమతి ప్రకటన!: చిన్నారి తండ్రికి ఉన్న వ్యాపార, ఆర్థిక లావాదేవీలు, బయటి వ్యక్తులతో ఉన్న పరిచయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలు, మెడలోని వెండి బిళ్ల ఎక్కడైనా విక్రయించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. జీడిపిక్కలు ఏరుకోవడానికి కొండపైకి వచ్చేవారిని, తల్లి స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అనుమానితులను విచారిస్తున్నారు. చిన్నారి సమాచారం తెలిపిన వారికి రూ. 1 లక్ష బహుమతి అందిస్తామని కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రకటించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ఈ కేసు దర్యాప్తు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

