CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందుకు బలం చేకూరుస్తూ.. ఇవాళ ఉదయం గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్ కోరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మధ్యప్రదేశ్ పర్యటనలో గవర్నర్: ఈ కీలక పరిణామం వేళ ఒక ఆసక్తికరమైన సందిగ్ధత నెలకొంది. సీఎం సిద్ధరామయ్య అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ.. ముందే ఖరారైన తన అధికారిక షెడ్యూల్ ప్రకారం గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. గవర్నర్ రాజధాని బెంగళూరులో అందుబాటులో లేకపోవడంతో.. సిద్ధరామయ్య తన రాజీనామాను ఈరోజే సమర్పిస్తారా? లేక గవర్నర్ తిరిగి వచ్చేవరకు వేచి చూస్తారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ లేకపోయినప్పటికీ రాజ్‌భవన్ కార్యాలయంలో రాజీనామా లేఖను అందిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సిద్ధూ రాజీనామా ఎపిసోడ్‌తో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Also read-Karnataka: కన్నడ పీఠంపై డీకే.. నేడు సిద్ధరామయ్య రాజీనామా!
జాతీయ రాజకీయాలకు సిద్ధూ నో!: సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకుంటారని వస్తున్న కథనాల నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అందుకు సిద్ధరామయ్య సుముఖంగా లేరని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా.. కర్ణాటక రాజకీయాల్లోనే మరో రెండేళ్లు కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం.

