Karnataka: కన్నడ రాజకీయం నేడు కీలక మలుపు తిరుగనుంది. గత కొన్ని నెలలుగా కర్ణాటక సీఎం మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో సిద్ధరామయ్య స్థానంలో నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను హైకమాండ్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
నేడు అల్పాహార సమావేశం: నేడు ఉదయం జరగబోయే కీలకమైన అల్పాహార సమావేశంపైనే ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి. ఈ సమావేశం ముగిసిన అనంతరం సిద్ధరామయ్య బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని సమాచారం. మరోవైపు డీకే శివకుమార్ నేడు ఉదయాన్నే దిల్లీ నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకుని.. సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
రెండు పవర్ సెంటర్ల మధ్య సమతుల్యత: 2023 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల రూపంలో రెండు బలమైన పవర్ సెంటర్లు ఏర్పడ్డాయి. వీరి మధ్య సమతుల్యతను కాపాడటానికి హైకమాండ్ చాలాకాలంగా కసరత్తు చేస్తోంది. చివరకు సిద్ధరామయ్యను ఒప్పించి ఈ నాయకత్వ మార్పును సుసాధ్యం చేయడం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి దక్కిన పెద్ద విజయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సిద్ధరామయ్యకు భరోసా: ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో, కీలక మంత్రుల ఎంపికలో సిద్ధరామయ్యకు తగిన ప్రాధాన్యం ఉంటుందని అధిష్ఠానం ఆయనకు గట్టి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు నూతన క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం బలంగా సాగుతోంది.
మే 30న ప్రమాణ స్వీకారం!: నేడు సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా సమర్పించిన తర్వాత.. కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో డీకే శివకుమార్‌ను నూతన నేతగా ఎన్నుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. అనంతరం కొత్త ముఖ్యమంత్రి మే 30న ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

