HomeTop StoriesBRS : ఎర్రవెల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

BRS : ఎర్రవెల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

సిద్దిపేట (తెలుగుప్రభ): తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామానికి సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వేదిక కానుందా..? రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ఒకరోజు ముందు అంటే, ఈ నెల 6న బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభాపక్ష (బీఆర్‌ఎస్‌ఎల్పీ) సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు శుక్రవారమిక్కడ ‘తెలుగుప్రభ’కు తెలిపాయి. ఈ సమావేశం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో జరిగే అవకాశమున్నట్లు సమాచారం.

- Advertisement -

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం..
ఎర్రవెల్లి నుంచి కేసీఆర్‌ కార్యాలయ సిబ్బంది పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమావేశానికి హాజరుకావాల్సిందిగా సమాచారం పంపినట్లు తెలుస్తోంది. లంచ్‌ అనంతరం ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సభా వ్యూహంపై చర్చ..
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు తదితర అంశాలను సభలో ఏ విధంగా ప్రస్తావించాలనే దానిపై కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం, శాసనమండలిలో పార్టీ పాత్ర, ప్రజా సమస్యలను సభా వేదికగా ప్రస్తావించే విధానం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేసీఆర్‌ అసెంబ్లీకి వెళ్తారా..?
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరు కావాలంటూ అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలు, శ్రేణులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ విమర్శలు, ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఎర్రవెల్లిలో జరగనున్నట్లు చెబుతున్న బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరవుతారా..? లేక ఎర్రవెల్లి నుంచే పార్టీ శాసనసభాపక్షానికి దిశానిర్దేశం చేస్తారా..? అన్న అంశం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సమావేశం జరిగితే కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే సూచనలు, అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ అనుసరించబోయే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది.

బీఆర్‌ఎస్‌లో కీలక భేటీగా..
ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పాలన, హామీల అమలుపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే అవకాశం ఉన్న బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు..? సభలో ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీస్తారు..? బీఆర్‌ఎస్‌ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంది..? అన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News