HomeTop StoriesDowry Case: నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తేవాల్సిందే!

Dowry Case: నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తేవాల్సిందే!

Dowry Case: రంగు తక్కువగా ఉందనే నెపంతో భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. లుకౌట్ నోటీసుల ఆధారంగా చెన్నై ఎయిర్‌పోర్టులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సుధాచంద్రికకు.. ఏపీలోని ఒంగోలుకు చెందిన వెంకట నవీన్‌సాయి చందుతో 2022లో వివాహమైంది. నవీన్‌సాయి కెనడా పౌరసత్వం కలిగి ఉండి.. అక్కడే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహానంతరం సుధాచంద్రికను కెనడాకు తీసుకెళ్లాడు. వీరికి తొమ్మిది నెలల కుమార్తె ఉంది.

- Advertisement -

కెనడాలోనే మొదలైన వేధింపులు: పెళ్లయిన నాటి నుంచే నవీన్‌సాయి తన భార్యను రంగు తక్కువగా ఉన్నావని ఎగతాళి చేస్తుండేవాడు. అంతేకాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం ప్రారంభించాడు. దీంతో సుధాచంద్రిక కెనడా పోలీసులకు ఫిర్యాదు చేయగా..అక్కడ కూడా నవీన్‌సాయి అరెస్టయ్యాడు. ఆ కేసులో బయటకు వచ్చిన అనంతరం.. గత జనవరిలో భార్యాపిల్లలతో కలిసి ఇండియాకు వచ్చాడు.

పాస్‌పోర్టులు లాక్కొని పరారీకి యత్నం: ఇండియాకు వచ్చిన తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించినా నవీన్‌సాయి ప్రవర్తనలో మార్పు రాలేదు. చిన్నారి అన్నప్రాశన వేడుక కోసం ఒంగోలు వెళ్లిన సమయంలో భార్య తరఫు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరదలి నిశ్చితార్థం కోసం ఖమ్మం వచ్చిన సమయంలో.. భార్య, కుమార్తెకు సంబంధించిన పాస్‌పోర్టులను బలవంతంగా లాక్కొని వెళ్లిపోయాడు. దీనిపై గత నెలలో సుధాచంద్రిక ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ భార్యాపిల్లలను ఇక్కడే వదిలేసి ఒంటరిగా కెనడాకు పారిపోవడానికి నవీన్‌సాయి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు మే 14న ఖమ్మం పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Also read-Crime: అల్వాల్‌లో దారుణం.. ప్రియుడి మోజులో కన్నబిడ్డను చంపిన తల్లి!

చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్: లుకౌట్ నోటీసుల నేపథ్యంలో మే 18న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశం దాటిపోయేందుకు ప్రయత్నిస్తున్న నవీన్‌సాయిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకుని ఖమ్మం పోలీసులకు అప్పగించారు. మే 20న నిందితుడిని ఖమ్మం ప్రత్యేక మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. అలాగే నిందితుడి పాస్‌పోర్టును కోర్టు స్వాధీనం చేసుకుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News