Kasibugga Stampede: పవిత్ర కార్తీకమాసం పర్వదినాల్లో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో జరిగిన తొక్కిసలాట ప్రమాదం 10 మంది భక్తుల మరణానికి దారితీసింది. ఇందులో ఎక్కువగా మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. వాస్తవంగా దేవాలయంలో ఉన్న సౌకర్యాలు రెండు నుంచి మూడువేల మంది భక్తుల దర్శనానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఇవాళ ఒక్కరోజే కార్తీక ఏకాదశి కావటం దానికి తో డు శనివారం కావటంతో ఏకంగా 25వేల మంది భక్తులు ఆలయానికి వచ్చారని వెల్లడైంది. వాస్తవంగా ఉన్న ఏర్పాట్ల కంటే ఇది 10 రెట్లు అధిక తాకిడి.
ఇంత భారీ స్థాయిలో పోటెత్తిన భక్తులతో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన ఒక రెయిలింగ్ రద్దీ సమయంలో విరగడంతో భక్తులు పడిపోయారని వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా ఏర్పడిన గందరగోళ పరిస్థితి తొక్కిసలాటకు దారితీసిందని ఘటన జరిగిన సమయంలో ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. అయితే దీనిపై సీఎం నుంచి ప్రధాని వరకు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి చికిత్స నుంచి మరణించిన వారికి పరిహారం వరకు ప్రకటన చేశారు.
అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం ఇది పూర్తిగా పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఊహించని స్థాయిలో ఆలయ సౌకర్యాలు, సామర్థ్యానికి మించి భక్తులు దర్శనాల కోసం రావటమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమిక దర్యాప్తు చెబుతోంది. అయితే పరిస్థితిని నేరుగా పరిశీలించేందుకు మంత్రి లోకేష్ శ్రీకాకుళం చేరుకుంటున్నట్లు సమాచారం.
తొక్కిసలాటపై ఆలయ నిర్వాహకుల మాట ఇదే..
ఇవాళ జరిగిన తొక్కిసలాట ఘటనపై కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా కూడా స్పందించారు. వాస్తవానికి తాము ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని.. సాధారణంగా ఆ ఆలయానికి 2 వేలమంది వరకు భక్తులు వస్తుంటారన్నారు. తాను భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తానని అన్నారు. కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. దీనికి సంబంధించిన వివరాలు కలెక్షన్, ఎస్పీ ఆయన నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు హరిముకుంద్ పండా పోలీసు పహారాలో ఆలయం ఆవరణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి వారాతంలో భక్తుల తాడికి ఊహించని ప్రమాదానికి దారితీసింది.


