KTR fire on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ముమ్మాటికి ఇక్కడి భూమి పుత్రులదేనని ఆయన స్పష్టం చేశారు.
డొంకతిరుగుడు మాటలు ఎందుకు?: ఏపీ నుండి తెలంగాణను విభజించిన పద్ధతి తనకు నచ్చలేదని పవన్ కల్యాణ్ గతంలో అన్న మాటలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదని సీదాగా చెప్పకుండా.. ఇలా డొంకతిరుగుడు మాటలు మాట్లాడటం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ విభజన ఇష్టం లేదని గతంలోనే పవన్ చెప్పారని అన్నారు. అప్పట్లో 11 రోజులు అన్నం తినకుండా ఉన్నానని చెప్పుకున్న పవన్ కల్యాణ్‌కు.. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.
Also read-Telangana: మళ్లీ సెంటిమెంట్ పాలిటిక్స్.. బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం!
ఇది ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే!: తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అన్నట్లుగా జనసేనాని చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. “తెలంగాణ మీ అయ్య జాగీరా అంటున్నారు కదా.. కచ్చితంగా చెప్తున్నా.. ఇది ఈ గడ్డపై పుట్టిన భూమిపుత్రుల జాగీరే” అని తేల్చిచెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

