HomeTop StoriesKTR: అధికారంలోకి రాగానే 24 గంటల తాగునీరు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: అధికారంలోకి రాగానే 24 గంటల తాగునీరు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Hyderabad: తాగునీటి అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే.. హైదరాబాద్‌కు 24 గంటల తాగునీరు ఇచ్చేది కూడా కేసీఆరే” అని అన్నారు. బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

నాడు కరెంట్.. నేడు మంచినీరు: ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్‌తో పాటు నీటి కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ పట్టుదలతో.. 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందించారని అన్నారు. అదే తరహాలోనే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి నిరంతరాయంగా మంచినీరు అందిస్తామని స్పష్టం చేశారు. నగరానికి 24 గంటల మంచినీరు అందించే బాధ్యతను తానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అబద్ధాల పాలన: హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని కేటీఆర్‌ అన్నారు. వారి పరిపాలనపై పూర్తి అవగాహన ఉండబట్టే గత ఎన్నికల్లో నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఫ్లై ఓవర్లు, ఆసుపత్రులు, భవనాలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఓపెన్ చేస్తూ.. తామే కట్టామంటూ అబద్ధాలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Also read-Harish Rao: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయండి.. ఏపీ ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి

దొంగ ఓట్లపై అప్రమత్తత: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు నమోదు చేయిస్తున్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క బీఆర్ఎస్ సానుభూతిపరుడి ఓటు కూడా తొలగిపోకుండా పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డితో పాటు నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News