– ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
– 1,432 పోలింగ్ కేంద్రాలు.. 12.50 లక్షల మంది ఓటర్లు
– 26 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
– సమస్యాత్మక గ్రామాల్లో భారీ బందోబస్తు
– 8,281 మంది పోలింగ్ సిబ్బంది.. 52 ఫ్లయింగ్ స్క్వాడ్లు
– ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి
కర్నూలు ప్రతినిధి,(తెలుగు ప్రభ):స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కర్నూలు జిల్లా సిద్ధమైంది. రెండో విడత సాధారణ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు.
12.50 లక్షల మంది ఓటర్లు:
జిల్లాలో మొత్తం 26 జడ్పీటీసీ స్థానాలకు, 432 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 74 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 368 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 1,432 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 12,50,166 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 6,21,167 మంది పురుషులు, 6,28,834 మంది మహిళలు, 165 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏదైనా కారణంతో రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 6న నిర్వహించనున్నారు. నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

97 మంది జడ్పీటీసీ అభ్యర్థులు.. 907 మంది ఎంపీటీసీ అభ్యర్థులు:
జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 198 నామినేషన్లు రాగా, పరిశీలన అనంతరం 165 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. 68 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, చివరకు 26 స్థానాలకు 97 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 2,107 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 1,998 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. మొత్తం 358 ఎంపీటీసీ స్థానాలకు 907 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు 74 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కోసిగి మండలంలో 20, వెల్దుర్తిలో 15, కృష్ణగిరిలో 12, పత్తికొండలో 6, హాలహర్విలో 4, మంత్రాలయంలో 3, ఆలూరులో 3, హోళగుందలో 3, కర్నూలు రూరల్‌లో 5, కౌతాళంలో 2, చిప్పగిరిలో ఒక ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా:
జిల్లాలోని 1,432 పోలింగ్ కేంద్రాలను అధికారులు మూడు కేటగిరీలుగా విభజించారు. 94 ప్రాంతాల్లోని 299 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 161 ప్రాంతాల్లోని 398 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మరో 393 ప్రాంతాల్లోని 735 కేంద్రాలను సాధారణ కేటగిరీలో చేర్చారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 697 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మరో 735 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో 255 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను అరికట్టేందుకు 52 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 52 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో వీడియోగ్రాఫర్లను కూడా అందుబాటులో ఉంచారు.
8,281 మంది సిబ్బందితో పోలింగ్ నిర్వహణ
ఎన్నికల విధుల కోసం మొత్తం 8,281 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 1,575 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), 1,578 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), 5,128 మంది ఇతర పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం అదనంగా 2,172 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు 306 వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిలో 206 బస్సులు, 75 మినీ వాహనాలు, 25 టూఫాన్ వాహనాలు ఉన్నాయి. ఎన్నికల పర్యవేక్షణకు 85 మంది జోనల్ అధికారులు, 171 మంది రూట్ అధికారులు విధుల్లో ఉంటారు. మొత్తం 2,864 పెద్ద బ్యాలెట్ బాక్సులను మండల స్థాయిలో సిద్ధంగా ఉంచారు.
ఆరు కౌంటింగ్ కేంద్రాలు.. 29 స్ట్రాంగ్ రూమ్‌లు:
ఎన్నికల అనంతరం బ్యాలెట్ పత్రాల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా 29 స్ట్రాంగ్ రూమ్‌లు, 37 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, హోళగుంద, పత్తికొండ ప్రాంతాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 26 మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, 26 రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ, మండలాలకు పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పత్రాలను వేరు చేసి మండల కేంద్రాల్లో భద్రపరిచారు. గ్రామాల్లో ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టారు. పోలింగ్ సిబ్బంది, అధికారుల సౌకర్యార్థం పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి:
ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఉంచనున్నారు. ఓటర్లు భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయాలని కలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

