North Atlantic Ocean: నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవులు (Faroe Islands) మరోసారి రక్తసిక్తమయ్యాయి. అక్కడ ఏటా నిర్వహించే వివాదాస్పద సాంప్రదాయ వేట “గ్రైండాడ్రాప్”లో భాగంగా స్థానిక ప్రజలు ఘోరానికి ఒడిగట్టారు. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను నరికి చంపారు. మే 27న జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
రక్తసముద్రంగా మారిన తీరం: ఈ వేటలో భాగంగా స్థానికులు కొక్కేలు, పదునైన కత్తులతో సముద్ర జీవులను ఒడ్డుకు తెచ్చారు. అనంతరం వాటి శరీరాలను ఇష్టమొచ్చినట్లు చీల్చేశారు. వందలాది మూగజీవులను యథేచ్ఛగా సంహరించడంతో నార్త్ అట్లాంటిక్ సముద్ర తీరం రక్తంతో ఎరుపెక్కింది. ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also read-Donald Trump: ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్య నిలిపివేతకు యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదం!
తల్లడిల్లుతున్న పర్యావరణ ప్రేమికులు: 402 పైలట్ తిమింగలాలతో పాటు 304 డాల్ఫిన్లను అతికిరాతకంగా చంపినట్లు తెలుస్తుంది. పర్యావరణ ప్రేమికులు, జంతు సంరక్షణ సంఘాలు ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం దీనిని తమ పూర్వీకుల నాటి సంప్రదాయంగా సమర్థించుకోవడం గమనార్హం. ఈ ఊచకోతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

