Rahul gandhi: తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు (సోమవారం) రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్‌లో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ శిబిరం నేటితో ముగియనుంది. ఈ ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరుకానున్నారు.
పర్యటన వివరాలు: ఉదయం 9:30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం శంషాబాద్ నుంచి నేరుగా వికారాబాద్‌కు బయలుదేరుతారు. రెండు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులతో రాహుల్ ముఖాముఖి భేటీ అవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాహుల్ గాంధీ తిరిగి దిల్లీకి చేరుకుంటారు. రెండు రాష్ట్రాల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, రాబోయే రాజకీయ సవాళ్లపై క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు ఈ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది.
రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్:
- ఉదయం 07:10: దిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో బయలుదేరుతారు.
- ఉదయం 09:20: హైదరాబాద్ (శంషాబాద్) విమానాశ్రయానికి చేరుకుంటారు.
- ఉదయం 10:00: శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వికారాబాద్‌కు ప్రయాణం.
- ఉదయం 10:30 – సాయంత్రం 04:30: అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో డీసీసీ(DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొంటారు.
- సాయంత్రం 04:30: శిక్షణ ముగిసిన అనంతరం వికారాబాద్ నుంచి తిరుగు ప్రయాణం.
- సాయంత్రం 05:30: శంషాబాద్ నుంచి ఎయిరిండియా విమానంలో తిరిగి దిల్లీకి పయనం.
పర్యటన ప్రాధాన్యత: రోజంతా సాగే ఈ శిక్షణా కార్యక్రమంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ దృష్టి సారించనున్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాటాల గురించి రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
పటిష్ట భద్రత: రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వస్తున్న ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. అనంతగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా తనిఖీలు పూర్తిచేశారు.

