Rain Forecast: ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
కోస్తాంధ్రకు వర్ష సూచన: అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పోలవరం, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో సైతం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
Also read-CII Summit: సంక్షోభాలనే అభివృద్ధికి పునాదిగా మార్చుకోవాలి- సీఎం చంద్రబాబు
గత 24 గంటల పరిస్థితి: రాష్ట్రంలో ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అత్యధికంగా 32.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అల్పపీడనం మరింత బలపడనున్న నేపథ్యంలో ప్రజలు.. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

