Freedom of married women: పెళ్లైంది కదా అని భార్యపై భర్తకు సర్వహక్కులు ఉండవని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె ఇష్టాయిష్టాలే ప్రధానమని తీర్పునిచ్చింది. తన భార్యను ఒక వ్యక్తి అపహరించాడని ఓ వ్యక్తి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే తీర్పుతో భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది.
వయసు వ్యత్యాసమే అసలు కారణం: ఈ కేసు విచారణలో భాగంగా సదరు మహిళను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె ధర్మాసనం ముందు సంచలన వాంగ్మూలం ఇచ్చింది. తనను ఎవరూ అపహరించలేదని తెలిపింది. తను స్వచ్ఛందంగానే ప్రియుడితో వెళ్లానని స్పష్టం చేసింది. తనకు, తన భర్తకు మధ్య వయస్సులో చాలా వ్యత్యాసం ఉందని పేర్కొంది. వయసు వ్యత్యాసం రిత్యా తమ వైవాహిక జీవితంలో సంతోషం లేదని ఆమె వాపోయింది. అందుకే తనకు ఇష్టమైన వ్యక్తితో జీవించాలని నిర్ణయించుకున్నట్లు ధైర్యంగా వెల్లడించింది.
Also read-Election Campaign: అస్సాం సీఎంకు ముద్దు పెట్టిన మహిళా!
భర్తకు షాకిచ్చిన హైకోర్టు తీర్పు: మహిళ వాదనలను విన్న న్యాయస్థానం.. ఆమె మేజర్ అని నిర్ధారించుకుంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వయోజనురాలికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే లేదా ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. ఆమె మైనర్ కానందున.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఎక్కడికీ పంపలేమని తీర్పునిచ్చింది. బాధిత మహిళ మేజర్ కావడంతో.. ఆమె కోరుకున్న విధంగా ప్రియుడితో కలిసి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో భార్యను తిరిగి తెచ్చుకోవాలనుకున్న భర్తకు న్యాయస్థానంలో నిరాశే ఎదురైంది. ఈ తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

