Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం మహానాడు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికగా ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగం, ఖర్చులు తగ్గించేందుకు ఈసారి పార్టీ నాయకత్వం సరికొత్తగా హైబ్రిడ్(భౌతిక, వర్చువల్) విధానంలో దీనిని నిర్వహిస్తోంది. గతంలో కొవిడ్ సమయంలో పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించగా.. ఇలా భౌతిక-వర్చువల్ కలయికతో మహానాడు జరగడం ఇదే తొలిసారి.
రికార్డు స్థాయిలో ఆన్‌లైన్ భాగస్వామ్యం: నెల్లూరులో జరగాల్సిన ఈ వేడుకను పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ మోడ్‌లోకి మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా కేడర్‌లో ఉత్సాహం నింపేలా భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,875 క్లస్టర్లకు గానూ 1,851 క్లస్టర్లలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ తెరలు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సమస్య ఉన్న 24 క్లస్టర్లలో మండల కేంద్రాల ద్వారా కనెక్ట్ చేశారు. 200 కేంద్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు నేరుగా మాట్లాడేలా టూ వే కనెక్షన్ ఇచ్చారు. 25 లోక్‌సభ నియోజకవర్గ కార్యాలయాల్లోనూ ఇదే తరహా ఏర్పాట్లు జరిగాయి.
లక్షలాది మంది భాగస్వామ్యం: ఒక్కో క్లస్టర్‌లో 300 మంది చొప్పున, మొత్తం క్లస్టర్లు, లోక్‌సభ కార్యాలయాల ద్వారా దాదాపు 5.60 లక్షల మంది ఆన్‌లైన్‌లో పాల్గొననున్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో డిజిటల్‌గా భాగస్వామ్యమవ్వడం ఒక రికార్డు. ఈసారి తొలిసారిగా అండమాన్‌కు చెందిన పార్టీ శ్రేణులను కూడా ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఈ ఏడాది మహానాడుకు స్త్రీశక్తి థీమ్‌ను ఎంచుకున్నారు. వక్తల్లో మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. పార్టీకి సేవలందించిన నలుగురు మహిళా కార్యకర్తలను సత్కరించనున్నారు. పొలిట్‌బ్యూరో కొత్త సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి ప్రసంగించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధి నీరజారాణి వేదికపై ప్రసంగిస్తారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్తగా జెన్-జీ కేడర్‌తో ముఖాముఖి నిర్వహించనున్నారు.
20 తీర్మానాలు: రెండు రోజుల పాటు జరిగే ఈ మేధోమథనంలో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 10, తెలంగాణవి 4, ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ తీర్మానం 1 కాగా, చివరగా కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటుంది. స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, యువగళం, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం, ఆర్థిక పునర్నిర్మాణం- యుద్ధప్రభావం, పేదల సేవలో, అన్నదాతకు అండగా వంటి అంశాలపై తీర్మానాలు ఉంటాయి. తెలంగాణకు సంబంధించి అక్కడి ప్రభుత్వ వైఫల్యాలు, సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానాలు ప్రవేశపెడతారు.
స్థానిక ఎన్నికలకు దిశానిర్దేశం: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ఈ మహానాడును వేదికగా వాడుకోనున్నారు. నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి మహానాడు ఇదే కావడం విశేషం. గత వైకాపా ఐదేళ్ల పాలనలోని అవినీతి, అరాచకాలు, విద్వేష రాజకీయాలపై చర్చిస్తూ.. “విధ్వంసం, విద్వేషాలతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న గొడ్డలి పార్టీ.. అధిగమించి శరవేగంతో దూసుకుపోతున్న చంద్రన్న ప్రభుత్వం” అనే ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలు, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. 2029 ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను ఇక్కడే సిద్ధం చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు క్లస్టర్ల పరిధిలో కార్యకర్తలకు భోజనాలు, ఇతర సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ-మంగళగిరి మధ్య కృష్ణా నది వారధిపై పసుపు జెండాలు రెపరెపలాడుతూ మహానాడు శోభను సంతరింపజేశాయి.

