Ajit Pawar funeral: మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన ధ్రువతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) అంతిమయాత్ర అశేష జనవాహిని మధ్య ముగిసింది. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తమ ప్రియతమ నేతను చివరిసారిగా చూసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల నినాదాలతో బారామతి పురవీధులు మారుమోగాయి.
శోకసంద్రంలో బారామతి: కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు పూలతో అలంకరించిన ప్రత్యేక రథంపై అజిత్ పవార్ భౌతికకాయాన్ని ఊరేగిస్తుండగా.. “అజిత్ దాదా అమర్ రహే” అన్న నినాదాలు మిన్నంటాయి. ఆయన చిన్నాన్న శరద్ పవార్, సోదరి సుప్రియా సూలే, భార్య సునేత్ర పవార్ మరియు కుమారులు జయ్, పార్థ్ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. అంతిమ సంస్కారాల అనంతరం నిబంధనల ప్రకారం అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఆయన కుమారుడు జయ్ పవార్‌కు అందజేశారు.
Also read-Plane Crash : అజిత్ మరణం దైవ నిర్ణయం.. దయచేసి రాజకీయం చేయకండి: శరద్ పవార్ ఆవేదన
హాజరైన దేశాధినేతలు: అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలికేందుకు దేశ రాజకీయ దిగ్గజాలు తరలివచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై అజిత్ పవార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే, రాజ్ థాకరే సహా పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.మహారాష్ట్ర అభివృద్ధిలో అజిత్ పవార్ పోషించిన పాత్ర అద్వితీయమని, ఆయన మరణం రాష్ట్ర రాజకీయాల్లో పూడ్చలేని లోటని నేతలు కొనియాడారు. బారామతి అభివృద్ధిని ప్రపంచ పటంలో నిలిపిన నేతగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని నివాళులర్పించారు.

