Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి, డివైడర్‌ను దాటుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
సమయస్ఫూర్తితో ప్రయాణికులను కాపాడిన డీసీఎం డ్రైవర్: నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ (ARBCVR) ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగి మంటలు వ్యాపిస్తున్న సమయంలో.. అదే మార్గంలో వెళ్తున్న ఒక డీసీఎం డ్రైవర్ అప్రమత్తమయ్యారు. ఆయన తన వాహనాన్ని ఆపి.. వెంటనే బస్సు అద్దాలను పగులగొట్టారు. దీంతో ప్రయాణికులు కిటికీల గుండా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
బూడిదైన వాహనాలు: మంటలు వేగంగా విస్తరించడంతో బస్సుతో పాటు కంటైనర్ లారీ కూడా పూర్తిగా దహనమైంది. ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పినప్పటికీ.. వారి లగేజీ మొత్తం బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు యుద్ధప్రతిపాదికన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు

