యాదాద్రి (తెలుగుప్రభ): సీఎం రేవంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మృతిని చిరస్థాయిగా నిలిపేలా పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్‌లోని మామునూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కురుమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, కురుమ సామాజికవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మరింత ప్రాధాన్యం కల్పించాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమురయ్య త్యాగాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిపేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

