Coal mine: చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. దేశంలోని ప్రముఖ బొగ్గు గనిలో శనివారం ఉదయం సంభవించిన భారీ పేలుడు కారణంగా భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. లియుషెన్యూ బొగ్గుగనిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 82 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్: ఉదయం గనిలో కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. మొదటగా ఈ ప్రమాదంలో మరణాల సంఖ్యం తక్కువగానే ఉన్నట్లుగా భావించినప్పటికీ.. సహాయక చర్యలు ముమ్మరం చేసే కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీసే కొద్దీ విషాదం తీవ్రత బయటపడింది.
తొమ్మిది మంది కార్మికులు గల్లంతు: ఈ పేలుడు ధాటికి గనిలో పని చేస్తున్న మరో తొమ్మిది మంది కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. గని లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే లోపల దట్టమైన పొగ, శిథిలాలు పేరుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ లేదా సాంకేతిక లోపం వల్లనే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

